సంవిధాన నైపుణ్యం – వినూత్న వస్తు స్వీకరణం

     ఎప్పటికప్పుడు అతివేగంగా మారిపోతున్న సమాజం పోకడనీ, మనిషి ప్రవర్తనారీతినీ చదివి, పరిశీలించి, ఆ మార్పుల్ని విశ్లేషించి అవాంఛనీయతల్ని నిరసిస్తూ, ఆచరణీయమైన దానిని ఉన్నతీకరిస్తూ ఈనాటి – కథా రచన చేస్తున్న ఈనాటి రచయితల్లో దేశరాజు ప్రసిద్ధులు. పాఠకులకు సుపరిచితులు.

     దేశరాజు ‘షేమ్ షేమ్, పప్పీషేమ్’ 18 కధలున్న  సంపుటి. ఆ పేరున్న కథలో వస్తు కేంద్రం- ప్రైమరీ స్కూల్స్ నుండి కాలేజీల వరకూ – ఆడపిల్లల టాయ్ లెట్స్ దయనీయమైన దుస్థితి, ఆ కారణంగా వారి ఆరోగ్య సమస్యలూ ! ఈ వస్తువు ఇప్పటికి చాలా కథల్లో నలిగిందే అయినా, దేశరాజు తన కథకు కూర్చిన ఇతివృత్తం, ప్రయోగించిన కథనశిల్పం, శైలీ, సంవిధాన విలక్షణత- పూర్తిగా నూత్నమైనవీ, మేలైనవీ, అ-పూర్వమైనవీ! మొత్తం కథనాన్ని ఒక తండ్రి దృక్కోణంలోంచి చూపిన గొప్ప నిర్మాణం కలిగిన రచన! ఈ ఇతివృత్తంలో విశేషం – ఆయా బాధల్ని సహించి సహించి- ‘ఇంకానా ఇకపై సాగదు’ అంటూ యువతులంతా సామూహికంగా ఒక పెద్ద ఉద్యమంగా, నగరంలో ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో – తమ నిరసనని తిరుగులేని విధంగా తెలుపుతారు. అందుకు వారవలంబించిన విధానం – మగవారివలెనే గోడలమీద ‘వన్’ని పోసేయటం! జనానికీ, పాఠకులకూ దిగ్భ్రమ కలిగించే సన్నివేశం. ‘సహజం అనిపించే అసహజం కథ’ అన్నారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు. ఈ కథనీ అలా భావించినా, తెలుగు కథా సాహిత్యంలో మూసకు భిన్నమైన ఇతివృత్తంతో వెలువడిన అతి గొప్ప కథల్లో ఒకటిగా అజరామరం అవుతుంది!

    ఒక దౌర్భాగ్య సామాజిక దుస్థితిపై తిరస్కారాన్ని కథాత్మకం చేయటానికి అరిస్టాటిల్ చెప్పిన ‘పర్జింగ్ ఎఫెక్ట్’ ని అక్షరీకరించటం అంగీకార యోగ్యమే!!

     ‘కమ్యూనిస్ట్ భార్య’, ‘తాబేళ్లు’ కధలు – మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తినీ, ప్రవర్తననీ కూడా పారదర్శకం చేశాయి. స్వప్రయోజనం, అవకాశం – జమిలిగా ‘చెప్పేదొకటి, చేసేదొకటి’ తత్వాన్ని బహిరంగంగా, ధీమాగా ప్రదర్శించే వైనాన్ని శిల్పభరితంగా చిత్రించారు రచయిత.

     ‘బంగారు కలలు’తెలంగాణా ప్రత్యేక రాష్ట్రసాధనకు ప్రాణ త్యాగం చేసిన యువకుని అమరగాధ. చేయీ కాలు ఆడినంతకాలం చేతనైన పని చేసుకుంటూ పోవటమే ముసలితనానికి విరుగుడు – అని సందేశిస్తుంది ‘స్ఫూర్తి’ కథ.

     దివ్యాంగులు ధైర్యాంగులు కూడా అనే వాస్తవాన్ని చెబుతుంది ‘ధైర్యాంగులు’ కథ.

     వస్తువ్యామోహం, నానాజాతి ఆకర్షణలు, అసంతృప్తి, అశాంతీ- ఆధునికానంతర యుగ లక్షణం. కొంతమంది యువత, మధ్య వయస్కులు ఈ లక్షణాలతో వేదనపాలు కావటం, ఇక్కట్లలో చిక్కుకోవటం వారి  జీవన విషాదం. అసలు ‘సుఖం’ అంటే ఏమిటో ఒక బైరాగి చేత సూక్తిగా జీవన వేదాంతాన్ని చెప్పించి కథని ఉన్నతీకరించారు రచయిత. మంచికథ!

     ‘ఇగటు ‘ కథ గ్లోబలైజేషన్ ప్రభావంతో ఊరూరా, వీధివీధినా వెలసిన ‘మాల్ ‘కల్చర్ మీద వ్యంగ్యబాణం! కూరలమ్మికీ సూపర్ మార్కెట్ వారికీ మధ్యన గల అసలైన బతుకు నిజంని తేటతెల్లం చేసిందీ కథ. ఇద్దరిదీ వ్యాపారమే కానీ, కూరలమ్మిది ‘వాళ్ళలా దోచుకునే వ్యాపారం కాదు, మనసులు పంచుకొనే జీవన వ్యాపకం’ అనే వాస్తవికతకు పట్టంకట్టారు చివరికి !

     ఒక కథలో తన కన్ను పోతేకానీ, పేషంట్ కన్ను విలువని గుర్తించని  డాక్టర్ని చూస్తాము. ప్రమాదంలో పడిన వ్యక్తి ఎవరో తెలియక, అంబులెన్స్ కి దారి ఇవ్వక, జగడమాడిన యువకుడు.. ఆ ప్రమాదం జరిగింది తన తండ్రికే అనే నిజం తెలుసుకుని వగచే స్ధితిని మరోకథ చూపుతుంది. మనుషుల వక్ర బుద్దులు మార్చడానికి ఆధునిక సాంకేతిక ప్రయోగాలు అవసరమనే నిజాన్ని ‘రేప్.. యాప్’ కథ ధ్రువీకరిస్తుంది.

     దేశరాజు శైలిలో చక్కని చదివించే గుణం ఒక తేజోరేఖ. దేశరాజు కథలలో ఇతివృత్తాలన్నీ ఈనాటి ఆధునిక జనజీవన విషాదాల్ని, మనుషుల జీవన శైలిలోని వైరుధ్యాల్ని ఆవిష్కరించాయి. అంతర్లీనంగా జీవన లాలసనీ, సజీవ మానవ సంబంధాల్నీ ప్రోదిచేశాయి. బతుకుఅర్థం పరమార్థం సానుకూలతతో, సమన్వయంలో ఉన్నాయనే రవ్వంత అనురాగ సుధని పంచుతాయి. రచయితగానే కాక దేశరాజుని  సాంస్కృతిక, సామాజిక బాధ్యతల్ని ఈవిధంగా నెరవేరుస్తున్న ఉత్తమ పౌరునిగా కూడా అభినందించవలసిందే!

వి హా రి

9848025600

21.05.2023, సృజన నేడు

2 thoughts on “సంవిధాన నైపుణ్యం – వినూత్న వస్తు స్వీకరణం

  1. బాగుంది…దేశరాజు కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి

    Like

Leave a comment