అవాంఛితం

‘ఛీ.. కాస్తంత ఏడ్చే స్వతంత్రం కూడా లేదు కొంపలో..’ అని గొణిగిందామె, భుజం దగ్గర నుంచి నైటీ పైకి లాక్కుని, తలవంచి చెంపల మీద కన్నీళ్లు తుడుచుకుంటూ.

తినేసిన టిఫిన్ ప్లేట్ సింకులో పెట్టి, చెయ్యి కడుక్కుని వెనక్కి తిరిగింది.

వెనకాలే వచ్చిన ఆయనకు ఆమె గొణుగుడు వినబడింది.

ఆ విషయం ఆమెకు తెలిసేలా ప్లేట్ కాస్త విసురుగా సింకులో పడేసి, చెయ్యి కడుక్కుని వెళ్లిపోతూ ఆమె వైపు చిరాగ్గా ఓ చూపు విసిరాడు.

ఆయన చూపులోని వేడి నుంచి తప్పించుకోవడానికి ముఖం అటువైపు తిప్పుకుంది. ఆయన వెళ్లాక, హేంగర్ నుంచి న్యాప్‌కీన్ తీసుకుని చేయి తుడుచుకుంటూ గట్టిగా నిట్టూర్చింది.

ఆలోచిస్తూనే కాఫీ పెట్టే ప్రయత్నంలో పడింది.

ఆమెకు ఈ చిరాకులు మామూలే.

అలా మామూలు కావడానికి ముందు ఆమె చాలా కంగారు పడిపోయేది. తరువాత ఆయన తత్వం తెలిసినా కన్నీళ్లు ఆపుకోవడం ఆమె తరం అయ్యేది కాదు. చావులు, అనారోగ్యలే కాదు.. వాళ్లవీ వీళ్లవీ కష్టాలు విన్నప్పుడు కూడా ఆమె కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరిగేవి.

‘ఆమె మనసు అంత సున్నితం మరి’ అంటారు ఆమెవైపు బంధువులు.

అంతే అయితే, పోనీలే అని ఆయన సరిపెట్టుకునుండేవాడేమో.

కానీ నిజ జీవిత సందర్భాల్లోనేగాక సినిమాల్లో విషాద సన్నివేశాలు చూసినా ఆమె కళ్లలో రుతుపవనాలు దట్టంగా కమ్ముకుంటాయి. ఆఖరికి టీవీ సీనియళ్లు చూసికూడా ఆమె ముక్కు తుడుచుకుంటూ ఉండటంతో

‘‘ఎప్పుడూ ఎందుకా ఏడుపు ఏదో ఇంట్లో శవం లేచినట్టు..‘‘ అని అతడు గట్టిగా అరిచేవాడు.

అప్పుడు మాత్రం ఆమెకు ఏడుపు బదులు కోపం తన్నుకొస్తుంది.

‘‘నా ఏడుపు..నా ఇష్టం. నీకేం..’’ అని విసవిసా వెళ్లిపోయేది.

ఈ కోపతాపాలు తప్పిస్తే మిగిలిన అన్ని విషయాల్లో ఇద్దరూ బాగానే ఉంటారు.

ఇద్దరివీ ప్రభుత్వ ఉద్యోగాలే. ఇంక్రిమెంట్లు, అవి అమల్లోకి వచ్చే తేదీలు, టాక్స్ కటింగులు వంటి చిన్నచిన్న సమస్యల వల్ల వారి జీతాల్లో అప్పుడప్పుడు ఒక్కొక్కరిది పైచేయి అవుతుంది. లేకపోతే, ఓ వెయ్యో, రెండు వేలో అటూఇటుగా ఇద్దరి జీతాలు సమానమే. ఇప్పుడందరికీ వుంటున్నట్టే వాళ్లకీ సిటీకి ఆ పక్కనో ప్లాట్, ఈ పక్కనో ప్లాట్ ఉన్నాయి. వాళ్లుంటున్న ఫ్లాట్ కూడా ఎంతో పొందికగా, అందంగా ఉంటుంది. అన్నట్టు అది కూడా వారి సొంతమే. ఎక్కడ, ఎప్పుడు ఏం కొనాలో అని మాత్రమే కాదు. ఇంటిని అలంకరించుకోవడంలో కూడా ఇద్దరూ ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తారు. కాకపోతే, ఆయన అభిప్రాయాలకు కాస్త విలువ ఎక్కువ.

ఆమె ఏడుపొక్కటేనా వారి మధ్య సమస్య-అంటే, కాదనే చెప్పాలి.

ఇంకొకటి కూడా వుంది. కాకపోతే, ఆమెకు అటువంటి కోరిక ఉందని అతడికి తెలీదు.

ఆడవాళ్లకు అటువంటి కోరిక వుంటుందని మీరు కూడా ఊహించలేరు.

ఆడవాళ్లకు నగానట్రా, చీరలు, అలంకరణలవంటివి తప్ప వేరే వ్యక్తిగతమైన కోరికలేముంటాయని చాలామంది ఆడవాళ్లే అనుకుంటూ వుంటారు. కాబట్టి, ఆ పురుష పుంగవుడిని అనుకుని ఏం లాభం అని ఆమె నిట్టూరుస్తుంది.

కొన్ని కోరికలు అంతే, ఎవరికీ చెప్పుకోలేరు. తాము తీర్చుకోవాలని తహతహలాడే కోరిక వేరేవారికి ఓ పిచ్చిపనిలా అనిపించవచ్చు. బాహ్యరూపంలో ఆధునికత తప్ప, మనస్సుల్లో సౌందర్యం చచ్చిపోయిన వాళ్లు ‘అదేం కోరిక, వెధవ్వేషాలు కాకపోతే..’ అని ఈసడించుకోవచ్చు.

అందుకే ‘ఛీ నోరు తెరిచి, ఆ విషయం ఎవరైనా ఎలా చెబుతారు?’ అని ఆమె కూడా తన నోరు నొక్కేసుకుంటూ వుంటుంది. కానీ, మనసు మొరాయిస్తూ వుంటుంది.

ఈ విషయంలో ఆమెకు కలిగే దుఃఖానికి ‘ప్రత్యక్ష’ బాధ్యుడు కాకపోయినా, పరోక్ష బాధ్యుడు అతడేనని వేరే చెప్పనక్కర్లేదు.

ఎందుకంటే, ఆమె ఆ కోరిక తీర్చుకునే వీలు లేకుండా, ఎప్పుడూ ఆ గదిలోనే వుంటాడు. పోనీ, వేరే గదిలో ఏసీ రిపేరు చేయిస్తాడా అంటే, అదీ లేదు. పిల్లలు వున్నప్పుడు ఆ గదినీ, అందులోని ఏసీని వాడుకునేవారు. వాళ్లు చదువుల కోసం వేరే ఊర్లకు వెళ్లిపోయాక.. గదీ, ఏసీ రెండూ మూలపడ్డాయి.

‘‘దాన్ని రిపేరు చేయించొచ్చు కదా?’’ అని ఓసారి అడిగింది.

ఆయన ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘వుండేది ఇద్దరం, చేరో గదిలో ఏసీ ఎందుకు?’’ అన్నాడు.

ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తోచలేదు.

‘నువ్వు మాత్రం ఆరేసుకు కూర్చుంటావ్ గదిలో, మేం మాత్రం చెమటలతో చావాలా?’ అని నోరు తెరిచి అనలేక పోయింది.

కాఫీ గ్లాసులు తీసుకుని హాల్లోకి వచ్చిందామె. హాల్లోని ఫ్యాన్ గాలి తగలగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. ఇలాంటప్పుడు ఒక్కసారిగా ఏసీగాలి ఒళ్లంతా తాకితే.. ఆ ఊహకే ఆమె మనసు ఝల్లు మంది. అసలే ఎండాకాలం, అందులోనూ అన్నిట్లోకి పైఫ్లోర్‌లోని ఫ్లాట్. దానికి తోడు వంట గది వేడి. ఇంకేముంది పది నిమిషాలు వుంటే చాలు.. స్నానం చేసినట్టే, చెమటలు ఒకటే కారిపోతున్నాయి.

నైటీ చేతులకు ముఖం మీద చెమటలు తుడుచుకుంటూ ఆయన కోసం చూసింది. అతడు బెడ్‌రూమ్‌లో ఏసీ వేసుకుని ‘ఎంజాయ్’ చేస్తుంటాడని ఆమెకు తెలుసు.

అయినా, ఒకటి రెండుసార్లు పిలిచింది. కానీ, లోపలి నుంచి ఎటువంటి జవాబు రాలేదు.

ఇక తప్పనిసరై ఆమె బెడ్‌రూమ్ తలుపు తట్టింది.

సాధారణంగా ఆయన బెడ్‌రూమ్‌లో వుంటే ఆమె గబుక్కున లోపలకు వెళ్లదు. ఎందుకంటే, అక్కడ వుండే దృశ్యం ఏంటో ఆమెకు తెలుసు. కానీ, రెండు మూడుసార్లు పిలిచినా ఆయన రాకపోవడం, కాఫీ చల్లారిపోతే.. ఆ కిచెన్‌లోకి వెళ్లి  చెమటలు కక్కుకుంటూ మళ్లీ వేడి చేయాలనే విషయం గుర్తుకురావడంతో ఆమె ఆ బెడ్‌రూమ్ డోర్ తెరవక తప్పలేదు.

ఆమె తలుపు ఓరగా తెరిచి లోపలికి చూడకుండా, ‘‘కాఫీ’’ అంది.

అయినా, ఆయన కనిపించాడు. మంచానికి అడ్డంగా, వెల్లకిలా పడుకున్నవాడు కాస్తా, వులిక్కిపడ్డట్టు లేచి.. లుంగీ సరి చేసుకుని

‘‘ఇలా ఇవ్వు’’ అన్నాడు.

ఆమె కాఫీ గ్లాసు తీసుకెళ్లి అతడికి అందించి, వెనక్కి చూడకుండా గబగబా బయటకు వచ్చేసింది.

‘పెట్టి పుట్టాడు, మగానుభావుడు’ అని అతడిని మనసులోనే తిట్టుకుంది.

‘అలా తనువంతా ఏసీ చల్లదనం తాకేలా ఒక్కసారైనా పడుకుని దొర్లగలిగితే..’ అనుకుంది.

అంతలోనే ‘ఆయన్ననుకోవడం ఎందుకు? నాకే ధైర్యం లేదు. నేనో పిరికి గొడ్డుని..’ అని తనను తాను నిందించుకుంది.

ఆయన లేనప్పుడైనా తనను తాను ‘అలా’ చూసుకోవాలంటే తెగ కంగారుగా ఉంటుంది. ఇంత వయసొచ్చినా ఆ ఊహ వస్తేనే ఆమెకు కాళ్లూ చేతులూ ఆడవు. ఇప్పుడూ అంతే.

వయసొచ్చిన కొత్తల్లో అటువంటి కోరిక వున్నా, అప్పుడు ఇలా అటాచ్డ్ బాత్రూమ్‌లు అవీ లేవు. హడావిడిగా రెండు చెంబులు పోసుకుని పరిగెట్టి రావాల్సిందే. ఆ కాస్తలోనే తల్లి ఒకటికి రెండుసార్లు ‘తొందరగా కానీవే’ అంటూ బయటి నుంచి అరిచేది. అద్దాల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. తలదువ్వుకుని ముస్తాబు అవ్వడానికి ఒక చెక్క అద్దం మాత్రమే వుండేది.

పెళ్లయిన కొత్తలో అనుకుంట, ఓసారి ఏదో హోటల్లో దిగారు.

ఎప్పట్లాగే గబగబా స్నానం ముగించుకుని టవల్ తీసుకుంటుండగా అద్దంలో గుండెల వరకూ కనిపించింది. అంతే, ఒక్కసారిగా తుళ్లిపడింది. ఎవరో పరాయివాళ్ల కంట పడినట్టు వంట్లో ఒకటే వణుకు. ఎప్పుడో సాయంత్రానికి గానీ మర్చిపోలేకపోయింది.

ఇప్పుడు ఇంటినిండా అద్దాలున్నాయి. బాత్రూమ్‌లో బస్ట్ సైజ్, బెడ్రూమ్‌లో ఫుల్ సైజ్ అద్దాలు. ఆయనతో కలిసి ఆనందించే క్షణాల్లో బెడ్ బల్బ్ లోవెలుగులో చాటుగా, మొహమాటంగా చూసుకునేది.

ఈ అనుభావానందాల నుంచే ఏసీ చల్లదనాన్ని ఒంటికి చుట్టుకోవాలన్న కోరిక జనించేదేమోనని ఆమెకు అనుమానం. నిద్రాణంగా వుండే ఆమెలోని ఆ కోరిక అప్పుడప్పుడు రగలడానికి కారణం మాత్రం అతడే. అతడు ఆనందిస్తున్నాడని తెలిసినప్పుడల్లా, తాను ఆనందించలేకపోతున్న విషయం ఆమెకు గుర్తుకు వస్తూ వుంటుంది.

‘అతడికి వున్న స్వేచ్ఛ తనకెందుకు లేదు? తానెందుకు తన శరీరాన్ని తనివితీరా చూసుకోలేకపోతోంది? తానెందుకు తన శరీరానికి అది కోరుతున్న సున్నితమైన స్పందనలు అందించలేకపోతోంది? అన్నీ ప్రశ్నలే. ఎవరినీ అడగలేని ప్రశ్నలే’ ఆవేశంలో బుర్ర మరింత వేడెక్కిపోయింది.

తాగేసిన కాఫీ కప్పును నుదుటికి అద్దుకుంటూ కళ్లు మూసుకుని ఆవేశాన్ని చల్లార్చుకుంటూ.. ‘నాకేం తక్కువ? చదువు, సంపాదనా.. అన్నీ వున్నాయి. కానీ.. అనుభవించే యోగమే లేదు’ అనుకుని నిర్లిప్తంగా నిట్టూర్చింది.

ఆమెను ఆలోచనల్లోంచి బయట పడెస్తూ ఫోన్ పాటందుకుంది. చూస్తే వాళ్ల చెల్లి.

‘‘చెప్పవే. డ్రెస్సులు వచ్చాయా? ఫొటోలు పెట్టు’’ అంది.

‘‘అందుకే చేసింది. వచ్చాయి కానీ, ఇంకా తీసుకోలేదు’’ అంది చెల్లెలు.

‘‘అదేం?’’

‘‘మరేం లేదు, డ్రెస్సులు తెచ్చాడు. కాకపోతే వాడి దగ్గర చిల్లర లేదంటున్నాడు. నా దగ్గరేమో అన్నీ అయిదొందల నోట్లే వున్నాయి. వాడేమో ఎస్సెమ్మెస్ పంపిస్తాను. క్యూ ఆర్ కోడ్ ఇస్తా, స్కాన్ చేయండి అంటున్నాడు. నాకేమో అవన్నీ తెలీవు. నీ నెంబర్ చెప్తా వాడికి. కొంచెం పే చేసెయ్యవే. నేను నీకు తర్వాత ఇస్తా’’ అంది చెల్లెలు గబగబా.

‘‘ఎన్నిసార్లు చెప్పినా గూగుల్ పేనో, ఫోన్ పేనో పెట్టుకోవు. సరే పంపించమను. పేమెంట్ చేస్తా’’ అందామె.

‘‘అవన్నీ నా ఫోన్‌లో వుంటే అనవసరంగా డబ్బులు పోగొట్టేసుకుంటానని ఆయన వద్దంటారు’’ అని నసిగింది. అది అబద్ధమనీ ఇద్దరికీ తెలుసు.

‘గూగుల్ పే, ఫోన్ పే కూడా ఇచ్చెస్తే పెళ్లానికి పూర్తిగా పగ్గాలు విడిచేసినట్టవుతుందని కాకపోతే, అదేమంత తెలివి తక్కువుదా మోసపోడానికి’ అనుకుందామె తనలో తను.

‘‘ఏంటే? ఏం మాట్లాడవ్? అంత ఆలోచనలో పడ్డావేం?’’ అంది చెల్లి.

దాంతో ఆమె మళ్లీ మాటలు మొదలు పెట్టింది.

కాసేపు ఆ మాటలు, ఈ మాటలు అయ్యాక.. ‘‘ఓ క్రెడిట్ కార్డు తీసుకోవే పోనీ. ఆన్‌లైన్ పేమెంట్లు సులువుగా చేయడానికి వుంటుంది’’ అంది.

‘‘ఎందుకులేవే నాకిదే సులువు. క్రెడిట్ కార్డయినా, బిల్లు కట్టేప్పుడు ఆయన లక్షా తొంభై ప్రశ్నలు వేసి ప్రాణం తీస్తాడు. మీ ఆయనంటే నువ్వు కంట నీరెడితే చూడలేడుగానీ, మా ఆయన అలా కాదులే. అయినా, నీకేమైనా కొత్తా?’’ అంది.

అవును, నిజమే. తను కూడా ఉద్యోగం చేస్తున్నా ఏటీఎం కార్డు కూడా దాని దగ్గర వుండదు. ఎప్పుడో వాళ్లాయనకు వీలైనప్పుడు నెలకు సరిపడా డబ్బులు దాని అకౌంట్‌లోంచే తీసి ఇస్తాడు. అవే వాడుకుంటుంది. అవసరమైతే ఇవ్వడని కాదుగానీ, తన డబ్బులను తానే అడుక్కోవాల్సి రావడంలోని ‘ఇరిటేషన్’ ఆమెలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నవారికి మాత్రమే అర్థమవుతుంది.

‘ఈ మొగాళ్లు పెళ్లాల మీద ఏదో ఒక రకమైన పెత్తనం చెలాయిస్తూ వుండాలని అనుకుంటారో, ఏమో..’ అని ఆలోచిస్తూ అన్యమనస్కంగా టీవీవైపు దృష్టిసారించింది.

ఆలోచనల్లో వుండగానే ‘‘ఏంటి మళ్లీ ట్యాప్ ఓపెన్ చేసావా?’’ అంటూ హల్లోకి వస్తూనే అడిగాడతను.

‘‘నాకదే పని మరి’’ అంటూ ఆమె విసురుగా లేచి ఫోన్ పట్టుకుని వంటింట్లోకి వెళ్లిపోయింది.

పొరుగింటి పుల్లగూర రుచి అన్నట్టు అందరికీ ఎదురింటామె మొగుడు మంచివాడిలాగానే కనిపిస్తాడు.

‘నువ్వు కన్నీరు పెడితేనే చూడలేడే మీ ఆయన’ అని అంతా పొగిడేస్తారుగానీ.. ఆ వంకతో ఆయన చలాయించే పెత్తనం గురించి మాత్రం వాళ్లకెవరికీ తెలియదు. ఈ ఏడుపు గొడవ ఇప్పుడిది కాదు.

తల్లిదండ్రులను వదిలిపెట్టి అతడితో వచ్చేప్పుడు ఏడుస్తుంటే.. ‘‘భర్తతో కాపురానికి వస్తున్నందుకు సంతోషంగా వుండాలిగానీ, ఏడుస్తావేం?’’ అన్న అతగాడి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తోచక అంత దుఃఖంలోనూ పుసుక్కున నవ్వొచ్చింది.

ఆ తర్వాత నుంచి కంట నీరెట్టుకున్న ప్రతి సందర్భంలోనూ ఆయన వేసే ప్రశ్నలకు అటూ నవ్వాలేదు, ఇటూ ఏడవనూ ఏడవలేక ఆమె పడే అవస్థ వేరే వాళ్లకి వెంట్రుకవాసంత కూడా అర్థం కాదు.

తన అమ్మమ్మ పోయిందని అమ్మావాళ్లు ఫోన్ చేసినప్పుడు ఏడిస్తే-

‘‘పెద్దావిడ పోక ఎంతకాలం ఉంటుంది? మనం మాత్రం ఎల్లకాలం వుండిపోతాం అనుకుంటున్నావా? ఎవరితోనూ చేయించుకోకుండా కాలూ, చేయీ ఆడుతుండగానే పోయింది. సంతోషించక ఏడుస్తావేం?’’ అన్నాడు.

కూతురు పెద్ద మనిషైతే.. జాగ్రత్తలన్నీ చెప్పి మొదటి రోజు స్కూలుకు పంపుతూ హత్తుకుంటే కళ్లు చెమ్మగిల్లాయి.

అప్పుడు ‘‘సహజంగా జరిగేదేగా, దీని క్కూడా ఏడ్వాలా?’’ అన్నాడు.

సినిమాలు, సీరియల్సూ అయితే సరేసరి. అవి చూస్తూ అందులో లీనమైపోతూ వుంటుందామె. భావోద్వేగాలను అణుచుకోలేదు. అలాగే ఆయనా విసుక్కోకుండా వుండడు.

అక్కడికీ ఆమెకు చేతనైన పద్ధతుల్లో ఆయనకు చెప్పి చూసింది.

‘‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయ’ని అన్నారబ్బా. అయినా, మంచికీ, చెడుకీ స్పందించకుండా వుండటానికి మనం ఏమైనా గుండ్రాళ్లమా? మనుషులం కాదూ’’ అంది ఓసారి.

‘‘ఆ సినిమా కబుర్లు నా దగ్గర చెప్పకు. వాళ్లు డబ్బు కోసం ఏమైనా రాస్తారు. అయినా, అన్నిటికీ ఏడుపుగొట్టు ముఖం వేసుకుంటే ఎలా?’’ అన్నాడతను.

‘‘అన్నిటికీ ఎక్కడ? కొన్నిసార్లు మనసు భారంగా అనిపిస్తుంది. మరికొన్నిసార్లు కళ్లు చెమ్మగిల్లుతాయి. కొన్నిసార్లు బావురుమని ఏడవాలనిపిస్తుంది. అయినా, ఏడిస్తే మనసు ఎంత తేలికపడుతుందో తెలుసా? ఏడుపు కూడా ఒక వరం’’ అంది.

అంత వివరంగా చెప్పాల్సిరావడం, చెబుతున్న ఆమెకే ఎబ్బెట్టుగా అనిపించింది.

అతను మాత్రం ఏమీ పట్టనట్టు ‘‘వెధవ ఏడుపుల్లో కూడా ఇన్నిరకాలున్నాయా?’’ అని వెటకారంగా తీసిపారేశాడు.

‘ఇలాంటి చిన్నచిన్న భావేద్వేగాలనే నియంత్రించేవాడు, తన మనసులోని అసలు కోర్కెలను బయటపెడితే అగ్గిరాముడైపోడూ?’ అనుకుందామె.

దాంతో ‘‘అన్నిటికీ ఏడుస్తున్నా.. ఏడుస్తున్నా అంటూ నన్ను తెగ ఏడిపిస్తున్నావ్ కదూ. రేపు నువ్వు చస్తే.. చచ్చినా ఏడవను చూడు’’ అంది కోపంతో కడుపు మండిపోయి.

అతడు మాత్రం చాలా సింపుల్‌గా ‘‘చచ్చాక నేనెలా చూస్తా?’’ అని చిన్నగా నవ్వుతూ అక్కడ్నించి వెళ్లిపోయాడు.

అతడి చర్యతో అగ్నికి ఆజ్యమే కాదు, గాలి కూడా తోడయినట్టు ఆమె ఊగిపోయింది.

‘‘చూస్తూ వుండు, నిజ్జంగా ఏడ్వను’’ అని అరిచింది కచ్చిగా.

కొన్నేళ్లకు ఆ రోజు రానే వచ్చింది.

అప్పుడెప్పుడో చేసిన శపధం ఆమెకు ఆ క్షణంలో నిజంగా గుర్తు లేదు. కానీ, ఆమెకెందుకో ఆ సందర్భంలో ఏడుపు రాలేదు. వయస్సు వల్ల వచ్చిన నిర్లిప్తతో, అనుకోని షాక్ వల్లో ఆమెలోంచి దుఃఖం పెల్లుబికలేదు.

ఆయన పార్థివ దేహం గుమ్మం బయట కారిడార్‌లో వుంది. ఆమె గుమ్మం లోపల కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుని వుంది. మంచి ఎండాకాలమేమో.. పగలు, రాత్రి తేడా లేకుండా ఒకటే ఉక్కపోత. ఎవరో బిందెలతో నీళ్లు కుమ్మరించినట్టు చెమటలు దిగకారిపోతున్నాయి. ఆమె అలాగే ఆ కుర్చీలోనే కూర్చుని తడిసిపోతోంది. రాత్రిపూట మధ్య మధ్యలో వీచిన గాలి ఆమెను చల్లగా తాకుతోంది.

విషయం తెలియగానే ముందు సిటీలోనే వుండే చెల్లెలు వచ్చింది. వాళ్లాయనతో మాట్లాడి జరగాల్సిన ఏర్పాట్లు చూస్తోంది. అర్థరాత్రి దాటాకా ఒకరు, తెల్లారాక ఒకరు పిల్లలు కూడా వచ్చేశారు. చుట్టుపక్కల వాళ్లు, సిటీలోని బంధువులు ఒక్కొక్కరే వస్తున్నారు.  

అందరూ వస్తూండటంతో అక్క, పిల్లలు దగ్గరకు వచ్చి ఆమెను బలవంతంగా లేవదీశారు.

‘‘లోపలకు వెళ్లి ఆ నైటీ మార్చుకుని, చీర కట్టుకో. నలుగురు వస్తున్నారు’’ అంది చెల్లెలు. అనడమే కాకుండా ఆమెను చెయ్యిపట్టుకుని బెడ్ రూమ్‌లోకి తీసుకువెళ్లింది. కట్టుకోవలసిన చీర, బట్టలు అల్మారాలోంచి తీసి మంచం మీద పెట్టి తలుపు వేసుకుని బయటకు వెళ్లింది కూతురు.

రాత్రంతా ఏసీ వేసినట్టున్నారు, గది చల్లగా గజగజలాడించేలా వుంది. ఆమె చెమటలతో వేడిగా వుందేమో.. ఆ చల్లదనం ఆమెను నెమ్మదిగా స్పృశిస్తూ ఒళ్లంతా పాకుతోంది.

చీర అందుకుంటూ నైటీ తొలగించింది. ఒక్కసారిగా చల్లని ఏసీ గాలి ఎక్కడెక్కడో తడిమింది. ఆమె ఒళ్లు వడగాడ్పులో చిగురాటాకులా వణికింది. ఆమెలో ఏవో పులకింతలు రేగాయి. ఉద్వేగాలు ఉబికాయి. శపథం సడలినందుకో, చిరాకాల వాంఛ అవాంఛితంగా ఇలా తీరుతున్నందుకో ఆమెలో దుఃఖం సుడులు తిరిగింది. పెళ్లుమంటూ గొంతులోంచి ఒక శబ్దం వెలువడింది. కన్నీళ్లతో ఆమె మంచం మీద విరుచుకు పడిపోయింది.

గది బయట వున్న పిల్లలు ‘పాపం, అమ్మ ఏడుస్తున్నట్టుంది’ అనుకున్నారు.

‘‘పాపం, అప్పట్నించీ బిగబట్టుకుని వుంది. ఇక దానివల్ల కాలే..’’ అని కన్నీళ్లు పెట్టుకుంది చెల్లెలు. ఏమో? నిజమేనేమో, ఎవరికి తెలుసు?

7 thoughts on “అవాంఛితం

  1. నిజంగా బావుంది, మీ శైలిని ఎక్కడా వదలకుండా కొత్తగా కూడా ట్రై చేసారు. అభినందనలు మిత్రమా!!– Vasudev

    Like

  2. బాగుందబ్బాయ్ కథ! హాయిగా సాగింది. కానీయ్ ఇంకా రానీయ్!

    Liked by 1 person

  3. కథ బాగుంది. చివరిదాకా వేగంగా లాక్కుపోయింది. మానసిక విశ్లేషణతో కూడిన సన్నివేశాలతో చక్కగా రాశారు. అభినందనలు.

    Like

Leave a comment